B Nagi Reddy Vardhanthi

B Nagi Reddy Vardhanthi

బొమ్మిరెడ్డి నాగిరెడ్డి (డిసెంబర్ 2, 1912 - ఫిబ్రవరి 25, 2004) తెలుగు సినీనిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత.

జీవిత విశేషాలు :

ఈయన డిసెంబర్ 2, 1912న కడప జిల్లా, కొండాపురం మండలంలోని పొట్టిపాడు గ్రామంలో అమ్మమ్మ ఇంట, రైతు కుటుంబంలో జన్మించాడు. ఈయన స్వస్థలం, సింహాద్రిపురం మండలంలోని ఎద్దులయ్యగారి కొత్తపల్లె (వై.కొత్తపల్లె) గ్రామం.ఆ పల్లెటూరి వీధిబడిలో రామాయణ మహాభారతాలు, భాగవతంలాంటి పురాణగ్రంథాలను మాత్రమే బోధించేవారు. ధర్మబద్ధమైన జీవితం ఎలా గడపాలో ఉపాధ్యాయుడు పిల్లలకు రోజూ చెప్పేవాడు. ప్రాచీన గ్రంథాల్లోని సూక్తులను, సుభాషితాలను పిల్లలచేత కంఠస్థం చేయించేవాడు. ఆ ఉపాధ్యాయుడి వద్ద చదువుకున్న నాగిరెడ్డి పది, పన్నెండేళ్ళు వచ్చేనాటికే పురాణేతిహాసాలను క్షుణ్ణంగా ఆకళింపు చేసుకోగలిగాడు. అవన్నీ ఆయన ఆలోచనావిధానాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి.

ఆ తర్వాత ఆయన మద్రాసు (ఈనాటి చెన్నై) నగరాన్ని చేరుకుని కొన్నేళ్ళపాటు పాఠశాల విద్య అభ్యసించాడు. పాఠశాల విద్య పూర్తి కాకుండానే ఆయన తన కుటుంబం నడుపుతున్న ఎగుమతి వ్యాపార బాధ్యతలు చేపట్టవలసివచ్చింది.

యువకుడుగా అతని స్వాతంత్ర్యోద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు. ఖాదీ ఉద్యమంలో పాల్గొన్నాడు. కానీ వ్యాపార నిమిత్తం బర్మా వెళ్ళవలసి వచ్చింది. అయితే రెండవ ప్రపంచయుద్ధసమయంలో వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నది. ఆయన మళ్ళీ జీవితం కొత్తగా ప్రారంభించవలసివచ్చింది. ప్రింటింగ్ ప్రెస్ ను ప్రారంభించాడు. క్రమంగా ప్రచురణారంగప్రవేశానికి అదే దోహదం చేసింది. ఆంధ్రజ్యోతి అనే సామాజిక-రాజకీయ పత్రికను ప్రారంభించాడు.

అప్పుడే చక్రపాణి సాహచర్యం లభించింది. ఇద్దరూ కలిసి పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక పత్రికను తీసుకురావాలనుకున్నారు. దేశం స్వాతంత్ర్యం పొందడానికి ఒక నెల ముందుగా చందమామ ఆవిర్భావం జరిగి దినదినప్రవర్ధమానం కాసాగింది. ఆ తర్వాత ఆయన సినిమా నిర్మాణరంగప్రవేశం చేశాడు.

1974లో ఆయన దృష్టి వైద్యరంగం మీదికి మళ్ళింది. మద్రాసులో రెండు ఆసుపత్రులను నెలకొల్పాడు. కఠినశ్రమ, నిరాడంబరత, వినయం, నిర్దిష్ట పథకాలు రూపొందించడం, ఆయన సహజ గుణాలు. ఆయన పలికే ప్రతి మాటలోనూ, చేసే ప్రతి పనిలోనూ భారతీయ తాత్వికదృష్టి, ముఖ్యంగా భగవద్గీత ప్రబోధించే కర్మసిద్ధాంతప్రభావం స్పష్టంగా కనిపించేది.

ముద్రణ, ప్రచురణ, సినిమా రంగాల నుంచీ; ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలనుంచీ ఎన్నో అవార్డులూ, సత్కారాలూ ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి. విశ్వవిద్యాలయాలు గౌరవడాక్టరేట్లతో సత్కరించాయి.

చిత్రరంగంలో :

మొదట్నుంచి నాగిరెడ్డికి పబ్లిసిటీ విభాగం పట్ల ఆసక్తి ఉండేది. ఆయన తన అన్నగారైన బి.ఎన్.రెడ్డి స్థాపించిన వాహినీ సంస్థలో భాగస్వామిగా చేరాడు. రెండవప్రపంచయుద్ధ కాలంలో (1941లో) వాళ్ళ సరుకు తీసుకువెళ్తున్న ఓడ బాంబుదాడిలో ధ్వంసం కావడంతో పెద్ద మొత్తంలో నష్టం వచ్చింది. ఆ పరిస్థితుల్లో వ్యాపారం కొనసాగించలేక తన స్వగ్రామమైన ఓరంపాడు చేరాడు. ఆ తర్వాత వాహినీ వారి భక్తపోతనకు దర్శకత్వం వహించిన కె.వి.రెడ్డి నాగిరెడ్డిని మద్రాసుకు పిలిపించి ఆ చిత్రం తాలూకు పబ్లిసిటీ వ్యవహారాలు అప్పజెప్పాడు. సరిగ్గా అదే సమయంలో జెమినీ వారి బాలనాగమ్మ విడుదలైంది. జెమినీ వారు తమ చిత్రాలకు పెద్ద ఎత్తున ప్రచారం చేయిస్తారు. దానికి దీటుగా ఉండడానికి నాగిరెడ్డి మద్రాసులో హనుమంతుడి భారీ కటౌట్లు పెట్టించి వినూత్న రీతిలో ప్రచారం చేయించాడు. ఆ పబ్లిసిటీ చిత్ర విజయానికి బాగా తోడ్పడింది. దాంతో కె.వి.రెడ్డి ఆయనకు 500 రూపాయలు బహుమతిగా ఇచ్చాడు. ఆ మొత్తంతో నాగిరెడ్డి ఒక ఆస్టిన్ కారు కొన్నాడు.

విజయా సంస్థ :

తర్వాత 1950లో నిర్మాతగా మారి చక్రపాణితో కలిసి విజయా ప్రొడక్షన్స్ స్థాపించాడు. ఉన్నతమైన ప్రమాణాలతో పండితపామర జనరంజకంగా సినిమాలు తీసిన విజయా సంస్థ తెలుగు సినిమా చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని సృష్టించింది. 1950లో వచ్చిన షావుకారుతో మొదలైన ప్రస్థానం 1962లో వచ్చిన గుండమ్మ కథ వరకు ఉచ్ఛస్థితిలో కొనసాగింది. విజయుడనేది మహాభారత వీరుడు అర్జునుడి పేర్లలో ఒకటి. గెలుపును సూచించే ఆ పేరునే నాగిరెడ్డి తమ సంస్థకు ఎన్నుకున్నాడు. ఆ పేరు విజయా సంస్థకు సార్థకం కావడమే గాక పత్రికా ప్రచురణ, వైద్యం లాంటి ఇతర రంగాల్లో కూడా ఆయన్నే అంటిపెట్టుకుని ఆయన్ను విజయాధినేతగా మార్చింది. అర్జునుడి పతాకంపై పర్వతాన్ని మోసుకొస్తున్న హనుమంతుడి బొమ్మ ఉంటుంది. "జెండాపై కపిరాజు(హనుమంతుడు)" అని అందుకే అంటారు. అర్జునుడి ఆ పతాకమే విజయావారి లోగోలోనూ ఉంటుంది. లోగోలో "క్రియా సిద్ధి స్సత్వే భవతి" అనే ఆర్యోక్తి ఉంటుంది.

విజయావారి సినిమాలు :

షావుకారు : విజయా ప్రొడక్షన్స్ వారి మొదటి సినిమా ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించిన షావుకారు (1950). ఇది తెలుగులో మొట్టమొదటి అభ్యుదయ చిత్రంగా, తెలుగు సినిమాకు పునాదిరాయిగా కీర్తి అందుకొంది. సినిమా రచనలో అంతకు మునుపెరుగని వాస్తవికతను సాధించడమే ఈ కీర్తికి కారణం. ఐతే అప్పటి ప్రేక్షకులు ఆ సినిమాలోని కొత్త భావాలను ఆదరించలేకపోయారు. ఈ సినిమా అనుకున్నంతగా విజయవంతం కాకపోవడంతో తర్వాతి ప్రయత్నంగా కె.వి.రెడ్డి దర్శకత్వంలో పాతాళభైరవి తీశారు.

పాతాళభైరవి : 1951లో వచ్చిన ఈ సినిమాను జనం విరగబడి చూశారు. మళ్ళీ మళ్ళీ చూశారు. ఇది అంతకు ముందు ఎవరూ కనీ వినీ ఎరుగని ఘనవిజయం సాధించింది. దాంతో ఈ సినిమాను తర్వాత హిందీ, తమిళ భాషల్లో కూడా తీశారు. ఈ సినిమాలోని పాత్రలు తోటరాముడు, నేపాళమాంత్రికుడు, అంజిగాడు, సదాజపుడు, వాళ్ళ కోసం పింగళి నాగేంద్రరావు రాసిన సంభాషణలతో సజీవంగా ప్రజల మనసుల్లో స్థిరనివాసమేర్పరచుకొన్నారు. ఈ సినిమాతో ఎస్వీ రంగారావు లోని గొప్పనటుడు బయటకొచ్చాడు. ప్రేక్షకాదరణలో ఈ సినిమాను అధిగమించగలిగింది మాయాబజార్ ఒక్కటే!

విజయావారి మూడవ సినిమా పెళ్ళిచేసిచూడు. ఇది భారీగా లాభాలనార్జించింది. దీంట్లో ఎన్.టి.రామారావు, జి.వరలక్ష్మి, సావిత్రిలతో బాటు బాలనటుడిగా నటించిన మోహన్ కందాకు మంచి పేరొచ్చింది.

తర్వాత తమ సంస్థలో దర్శకత్వశాఖలో సహాయదర్శకుడుగా పనిచేస్తున్న కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో 1954లో చంద్రహారం తీశారు. ఇది గొప్ప చిత్రంగా విమర్శకుల ప్రశంసలు పొందింది కానీ ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించలేదు.

ఆ తర్వాత వారు తీసిన సినిమాలే నేటికీ తెలుగులో వినోదాత్మక సాంఘిక చిత్రాల్లో మేటిగా కీర్తించబడే మిస్సమ్మ, దాని తర్వాత మాయాబజార్. నిస్సందేహంగా ఇది ప్రపంచస్థాయి చిత్రం. వీటి తర్వాత వచ్చిన రెండు విజయవంతమైన విజయావారి సినిమాలు అప్పుచేసి పప్పుకూడు, గుండమ్మ కథ. గుండమ్మ కథతో ఒక శకం ముగిసినట్లైంది. ఆ తర్వాత వచ్చిన సినిమాలేవీ - ఆఖరుకు విజయావారి తర్వాతి సినిమాలు కూడా - ఆ స్థాయిని అందుకోలేకపోయాయి.

Ar-themes Logo

DailyWishes4u.in

Daily wishes provide daily images wishes like Good Morning, Good Night, Birthday wishes, Anniversary Wishes, Quotes, Occational Wishes, Important Days, Festivals, Interesting Facts etc.

No comments:

Post a Comment